ఆగస్టు 5 వ తేదీన ఖమ్మం నుండి కొంతమంది సాహితీ మిత్రృలం ముదిగొండ మృతవీరుల కుటుంబాలను పరామర్శించి, ఓ చిన్నపాటి కవి సమ్మేళనం నిర్వహించాలని వెళ్ళాం. మాతోబాటు కొత్తగూడెం, పాల్వంచ, విజయవాడ, హైద్రాబాద్ నుండి విరసం, జనసాహితీ, సాహితీ స్రవంతి మిత్రులమంతా యాదృచ్ఛికంగా ముదిగొండ సెంటర్లో కలుసుకున్నాం.ఆ బృందంలో కొంతమందిమి ఆ నరమేథం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి సమీపంలో ఉన్న ఓ స్కూల్లో చిన్న బ్యానర్ ఏర్పాటు చేసుకొని కవి సమ్మేళన సన్నాహాలు మొదలుపెట్టాం. అక్కడ ఓ ఇరవైమంది యువకులు క్రికెట్, మరేదో ఆట ఆడుతున్నారు. వాళ్ళలో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అక్కడకు రావడం మూలాన ఎవరొచ్చినా ఏం జరుగుతుందిలే అనే అనాసక్తతనూ గమనించాను. వెళ్ళిన మేమే శ్రోతలుగా, వక్తలుగా కొన్ని మాటలు కలబోసుకొని ముగించాం.
ఆ తర్వాత కాల్పుల్లో చనిపోయిన ఉసికిల గోపన్న ఇంటికి వెళ్ళాలనిపించింది. కాల్పులు జరిగిన రోజు అతను ముఖ్యమంత్రి దిష్ఠిబొమ్మను ఊరేగించాడనీ, రిక్షా కార్మికుడిగానే తన కొడుకును ఇంజనీరింగ్ దాకా చదివించాడని తెలిసి సెంటర్లో అతనిల్లెక్కడ అని అడిగాను. ఎలాగో వెతుక్కుంటూ అతనింటికి చేరుకున్నాను.
దాదాపు పాతికేళ్ళ క్రితం కట్టిన ఓ పాత ఇల్లు అది. మొరంతేలిన వాకిలి, మసిబారిన గోడలు, వానకు కురిసిన నీళ్ళచారలు, ఎప్పుడో కట్టిన తడికెలు ఇగ్లూను తలపించే ఆ ఇంటిలోకి నిటారుగా వెళ్ళలేం. నేలమీద కనీసం బేస్మెంటు కూడా లేకుండా నాలుగు ఇటుకలు పేర్చి కట్టిన ఆ ఇంట్లోనే గోపన్న కుటుంబ ఆవాసం. అతనితోబాటు భార్య, కొడుకు, కోడలు, పెళ్ళై ఇంటికి తిరిగివచ్చిన కూతురు, ఆమె పిల్లలు, అంత చిన్న ఇంట్లోనే అంతమంది. వాళ్ళకు నాలుగు గజాల స్థలం అవసరం కనుకనే ముఖ్యమంత్రి దిష్ఠిబొమ్మను ఊరేగించే పనికి పురికొల్పింది. ఇంటిముందు ఓ చిన్న చిరుగుల చాపపర్చి భార్యతోబాటు కొడుకూ, కూతురూ, కోడలూ బాసికం పట్లు వేసుకొని కూర్చున్నారు. ఆ తర్వాతరోజే గోపులు కర్మకాండలు, మోచేతులదాకా తొడిగి ఉన్న ఆమె చేతి గాజులు చూస్తే రాజ్యం చేసిన కసాయితనం కనిపించింది.
నేను వెళ్ళేటప్పటికి విరసం మిత్రులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎవరో ఫోటోలు తీస్తున్నారు. ఒకళ్ళిద్దరు వివరాలు నోట్ చేసుకుంటున్నారు. కూర్చున్న వాళ్ళంతా చేతులు దీనంగా జోడిస్తూ అర్థిస్తూ మాట్లాడుతున్నారు. వచ్చినవాళ్ళు ఎంతో కొంత ఇచ్చివెళతారనే ఆశకూడా వాళ్ళకుంది. గోపన్న కొడుకు పట్నంలో ట్రిపుల్ 'ఇ'లో ఇంజనీరింగ్ పూర్తిచేసి నాలుగు సంవత్సరాలు అవుతున్నా కార్పొరేట్ కుల కళ్ళకు ఆ డిగ్రీ కనిపించలేదు. తన ప్రతిభ కుల తక్కెడలో తూగలేక సమీప గ్రానైట్ కంపెనీలో గుమస్తాగిరి మాత్రం ఇప్పించగలిగింది. అంత చదువుకున్న అతను వరవరరావు గారు మాట్లాడి వెళ్ళగానే ఆయనెవరండీ! అని నన్నడిగారు. పేపర్లలో, టివిలలో నిత్యం కనిపించే ఓ సామాజిక ఉద్యమ కార్యకర్తను అడిగాడంటే ఆ కుటుంబ రాజకీయ నేపథ్యం, స్థితి కొంతమేరకు అర్థం చేసుకోవచ్చు.
నేలకొండపల్లి, ముదిగొండ పరిసర ప్రాంతాలకు తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం ఉంటే ఉండవచ్చు. యాదృచ్ఛికంగా కంచెర్ల గోపన్న ఈ ప్రాంతం వాడే. ఆ గోపన్న నుండి ఈ గోపన్న దాకా వ్యవస్థకృత దాష్టీకానికి బలి అవుతూనే ఉన్నారు. ఆ గోపన్నను తన భావదారిద్య్రం జైలుపాలు చేస్తే నేటి గోపన్నను మాత్రం నాలుగడుగుల స్థలం అడిగినందుకు శ్మశానంలో ఆరడుగుల బొందను సగౌరవంగా చూపిందీ వ్యవస్థ. నిజానికి రిక్షా గోపన్న రిక్షా కార్మికుడిగా కాకుండా వ్యవసాయ కూలీగా గ్రానైట్ కంపెనీ వర్కర్‌గా వెళ్ళి ఉంటే బ్రతికేవాడు. తనకు రిక్షా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను తీసుకొని వచ్చాడు.ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఓ ప్రజా ఉద్యమకారుణ్ణి గుర్తించలేదంటే, ఆ కుటుంబానికి నిజంగా రాజకీయ నేపథ్యం, చైతన్యమే ఉంటే చాపమీద కూర్చొని దీనంగా చేతులు చాపి నిరాసక్తంగా కూర్చోడు. ఏదిఏమైనా ఈ వ్యవస్థ చేసిన గాయం ఆ కుటుంబాన్ని కుదేలయ్యేటట్లు చేసింది. కానీ ఉసికిల గోపులు మాత్రం వీరోచిత తెలంగాణా సాయుధ పోరాటయోధుడు కాడు. వారి వారసుడుకాదు. రోజూ కూలీగా దిష్టిబొమ్మను తీసుకెళ్ళిన అతన్ని అదే దిష్టిబొమ్మ ఎకె 47గా గర్జించి ఏడుగుర్ని ఉసురు తీసుకుంది.
ఆ నేలకు తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యం ఉన్నమాట వాస్తమే. ఆనాటినుండి ఈనాటిదాకా ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో జరిగిన అలసత్వాన్ని, భూసమస్యపట్ల ఇంతకాలం నిరాసక్తంగా ఉన్న సమూహాలను గత నలభై సంవత్సరాలుగా కొన్ని సమూహాలు ఈదేశంలో రైతులే కూలీలుగా మారుతున్నారనీ, భూమి సమస్య పరిష్కరించడం ద్వారా ఉపరితల నిర్మాణాలు మారవనీ, కేవలం ఓటు ద్వారానే జనత ప్రజాస్వామిక విప్లవాలను కలగంటున్న కొన్ని శక్తులను కొన్ని ప్రశ్నలు అడగాలనిపిస్తోంది. ఆ సాయుధపోరాట యోధుల వారసులమని చెప్పుకొంటున్న వారి చైతన్యం నేడెక్కడ తాకట్టు పెడుతోంది అనే ప్రశ్నా ఉదయించక మానదు.
విద్యుత్ ఉద్యమంలో కాల్పులు జరిపిన అభినవ నీరోచక్రవర్తి వారసుడు, శవాలతో ధర్నా జరిపి పదిలక్షల డిమాండ్ చేస్తున్నాడు. ఆయన దాష్టీకానికి బషీర్‌బాగ్‌లో బలైన సత్తెనపల్లి రామకృష్ణ (మహా కూటమిని రామకృష్ణ క్షమించుగాక) భార్య మంగ నేడు నాలుగిండ్లలో పాచిపనులు చేసుకుంటోంది. ఆమె అతనిమీద విరుచకపడ్డది.
ఆనాటి కాల్పులలో జరిగిన బాధితులకు నష్టపరిహారం అందించడంలో జరిగిన అలసత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ఒకటిమాత్రం నిజం. ఇక్కడ జరిగిన ప్రతిహత్యకూ ఓ వర్గం ఉంది. కులం ఉంది. దాంతోబాటు ఓ 'వెల' కూడా వుంది. రామకృష్ణ హత్యకూ ఓ వెల ఉంది. గోపుల హత్యకూ ఓ వెల ఉంది. కానీ గోపుల భార్య వేసుకొన్న గాజులకు రేపటితో ఏ వెలా ఉండదు.
కాల్పులు జరిగిన రోజు యాదృచ్చికంగా చారుమజుందార్ అమరత్వం పొందినరోజూ, ఆరోజు సెంటర్లో కాల్పులు జరుపుతుంటే చావుకు సమీపంలో ఉన్న ఆ విగత జీవుల్ని ఈడ్చుకొంటూ సెంటర్లో నిరసన వ్యక్తం చేసే క్రమంలో శవాల్ని ఓ దగ్గరకు చేర్చిన కొందరు కార్యకర్తలు చనిపోయిన వ్యక్తి జేబుకు పెట్టిన బ్యాడ్జీ తిరగబడితే దాన్ని సరిచేసి సరిగా తీయండి అని కెమెరాలకు చూపడం లక్షలాది మందిమి టీవిల్లో గమనించాం. అక్కడ నిరసన వ్యక్తం చేయడం కంటే వాళ్ళను హాస్పటల్‌కు తరలించడంతో జరిగిన అలసత్వమూ గమనించాం. ఎక్కడకు వెళ్తున్నాం మనం! కాకుంటే ఆ బ్యాడ్జి ప్రయోజనాలు దానికున్నాయి. అధికారం ఆధిపత్యం పొందే క్రమంలో ప్రతి కాల్పులకూ ఓ ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం వెనక అధికార మార్పిడీ, నాలుగు సీట్ల తపనా ఉంది.
కాకుంటే ముదిగొండలో చనిపోయింది కేవలం దళితులు, కార్యకర్తలు మాత్రమే. నాయకులు ఎందుకు చావలేదు అనే ప్రశ్న నేనడగను. కానీ ముదిగొండలో జరిగిన హత్యలలో ముగ్గురు మాదిగలు, ఓ మాల, మరో ముగ్గురు బహుజనులు ఉన్నారు. కనుక చనిపోయింది ఏ కులం అనే చర్చ నాకనవసరం. ఆమాటకొస్తే నమ్మిన విశ్వాసానికి ప్రాణం పణంగా పెట్టిన సాకేతరాజన్, శ్యాం, మహేష్ వీళ్ళంటే నాకు గౌరవం కానీ ముదిగొండ గోపులుకి అది అంటగడితే చరిత్ర మనల్ని క్షమించదు.
భూమిసమస్య పరిష్కరించాలని చిత్తశుద్ది వుంటే - ముదిగొండలో ముష్కరుల పాలన లేదు. అలాగని నైజాం వారసుల పాలనాలేదు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట ఆ గ్రామం. కేవలం గ్రామం యూనిట్‌గా తీసుకుంటే అక్కడ వున్న మిగులు భూమి వివరాలు సాక్షాత్తూ స్టేట్ రెవిన్యూ వ్యవస్థకంటే ఆ గ్రామ సర్పంచ్, పెద్దలు లేదా గ్రామ కార్యదర్శికి స్పష్టంగా తెలుసు. ఆ ఊర్లో బంజరు ఎంత? సాగుభూమి ఎంత? మిగులు భూమి ఎంత? బంచరాయి ఎంత అనే విషయం స్పష్టంగా తెలుసు. గ్రామాన్ని నమూనాగా తీసుకొని మిగులు భూమి పంచి ఆదర్శంగా బయటి ప్రపంచానికి చెప్పవచ్చు కదా? ప్రతి గ్రామంలో ఆధిపత్యంలో ఉన్న పార్టీ నాయకుల, ఆధిపత్యకులాల చేతుల్లోనే ఈ మిగులు భూములు ఉన్నాయి. అంతేకానీ ఏ ఒక్క దళితుని చేతుల్లోనూ గజం నేల లేదు. అలాగని ప్రభుత్వ ఆధీనంలోనూ లేవు. మరి కాల్పులు ఎందుకు జరుగుతున్నాయి?
ముదిగొండ పరిసర ప్రాంతాల్లో దాదాపు నూటయాభై గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ వున్న వందకు పైగా ఫ్యాక్టరీలు ఒకే సామాజిక వర్గానికి, ఒకే రాజకీయ పార్టీ చేతుల్లో ఉన్నాయనే విషయం మనమెవరం ధైర్యంగా చెప్పలేకపోయినా, చనిపోయిన వాళ్ళకు మాత్రం తెలుసు. అక్కడ పెరుగుతున్న రియల్ఎస్టేట్, గ్రానైట్ కంపెనీల విస్తృతి మూలంగా స్వపక్ష, విపక్ష పార్టీల ఆధీనంలో ఉన్న మిగులు భూముల మీదికి ముందు ముందు జెండాలు పాతే విషయాన్ని ముందే పసిగట్టిన కొంతమంది ఆధిపత్య కులాలకు, కబ్జాదారులకు కంటగింపుగా మారింది. దాంతోబాటు పార్టీలోని అంతర్గత వైరుధ్యం వెరసి అక్కడి నాయకుడైన బండి రమేష్‌ను అంతచేయాలనే కుట్ర. (దాని పర్యవసానమే నిప్పుకు చెదలు, పార్టీలో ఎక్కువమంది ప్రజారాజ్యం తీర్థం పుచ్చుకున్నారు.) ఆ నాయకున్ని కాపాడుకొనే క్రమంలోనే ఈ కాల్పులు జరిగాయనేది ఓ కథనం కానీ, గోపులు వీరోచిత పోరాటయోధుడూ కాడు వారి వారసుడూ కాడు.
గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా భూముల్ని ఆక్రమించుకొనే క్రమంలో ఆధీనంలో ఉన్న భూముల్ని అన్యాయంగా, అక్రమంగా గుంజుకొనే క్రమంలో జరిగిన కాల్పులకు కాయకల్ప చికిత్స చేసే పనిలో, మేధోమధనంలో పడ్డారు. ఈదేశ బుద్ధి జీవులు అదేం అంటే నందిగ్రాం వేరనీ, ముదిగొండ వేరనీ, కళింగ నగర్, సింగూరు వేరువేరు అనే అంటున్నారు. తేడా ఎందుకు లేదు? అక్కడ నిక్షేపణంగా సాగులో ఉన్న వ్యవసాయ భూమిని బలవంతంగా గుంజుకోవడం ఇక్కడ జానెడు భూమికోసం ప్రభుత్వ భూమిల్లో జెండాలు పాతడం. అక్కడ మహిళలను క్రూరంగా రేప్ చేసి శవాలను మాయం చేయడం, ఇక్కడ చనిపోయిన మహిళల శవం మీద బ్యాడ్జీని సరిచేయడం, అక్కడ నష్టపరిహారం, న్యాయ విచారణకు అవకాశం లేదనడం ఇక్కడ న్యాయ విచారణతో బాటు ముఖ్యమంత్రిని మార్చాలి అని డిమాండ్ చేయటం అంతే తేడా ఏమిలేదు.
నాలుగు గజాల స్థలం మీద నాలుగు రోజులు జెండాలు పాతినంత మాత్రాన అవి పోరాటాలు అవుతున్నాయి. ఇప్పుడు ఆందోళనలకూ, పోరాటాలకూ హద్దులు చెరిగిపోతున్నాయి. హైవే పక్కన నాలుగు గజాల స్థలంలో ఎలక్ట్రానిక్ మీడియా హంగామా మధ్య జెండా పాతినంత మాత్రాన అవి పోరాటాలు అవుతున్నాయి. ఈ జెండాలు, సత్యం కంప్యూటర్ కొన్ని వేల ఎకరాల బినామీ భూముల మీద ఎందుకు పాతరు?
మరి గడచిన నాలుగు దశాబ్దాలుగా సిలిగురి, శ్రీకాకుళం నుండి, కోరుట్ల జగిత్యాల దాకా నాలుగు లక్షల ఎకరాల భూమి పంచి నాలుగు వేలమంది చేసిన బలిదానాన్ని ఏమందాం? నాలుగు రోజులపాటు జరిగే సీజనల్ రెడీమేడ్ ఆందోళనలకు పత్రికలలో ఫ్రంట్‌లైన్ కవరేజ్‌లు ఇస్తున్న మీడియా- దాని వెనుక దాగిన ప్రయోజనాలు దానికున్నాయి. ఎనిమిదేళ్ళ క్రితం ఆగస్టు 28న రాజధాని నడిబొడ్డున జరిగిన విద్యుత్ ఉద్యమ హత్యాకాండ మరోవాగ్దానాన్ని చేసింది. ఆ వాగ్దానం ముదిగొండలో జులై 28గా పరిణమించింది. అసహజ మరణాలకు నిలయమైన ఈ రాష్ట్రంలో ఈ హత్యలు ఇంకా పునరావృతమౌతూనే ఉంటాయి. మానవ హక్కులు మృగ్యం అవుతూనే ఉంటాయి.
రేపు రాజ్యం ఇవ్వబోయే చిల్లరతోబాటు గోపన్న కొడుకు అదే రాజ్యం ఇవ్వజూపుతున్న అటెండర్ ఉద్యోగంలో కొలువు కుదురుతాడు.దాంతోబాటు అదేరాజ్యం వితరణగా విదిల్చిన చిల్లరతో గోపన్న మనుమడు మరో భూపోరాటానికి సన్నద్దం అవుతాడు. చిత్రగుప్తుడు మరో ముదిగొండ లాంటి ప్రాంతాన్ని వెతుకులాడి మరో ముహూర్తం సిద్ధంచేస్తూ ఉంటాడు. చరిత్ర పునరావృతం అవుతూనే ఉంటుంది. పవర్ పాలిటిక్స్ గురించి రా.వి.శాస్త్రి ఓ మాట అన్నాడు. పల్లకీలో వర్మగారు కూర్చున్నా శర్మగారు కూర్చున్నా బరువు దాన్ని మోసే బోయీలదే. వర్మగారు ఎంత వేగంగా శర్మగారిని దించి అంతవేగంగా పల్లకీ ఎక్కినా బరువులో మాత్రం తేడారాదు. ఆ పల్లకీల మార్పు వేగవంతం చేసేపనిని మహాకూటమి పేరుతో వామపక్షాలు చేస్తున్నాయి. పల్లకీ మోసాలను తలకిందులు చేసేవరకూ బోయీలు బోయీలుగానే మిగిలిపోతారనేది చారిత్రక వాస్తవం.
ఆంధ్ర జ్యోతి లో వ్వ్యవస్తీ కృత దాష్టీకం పోఎదేప్పుడు గా ప్రచురణ