28 Ağustos 2008 Perşembe

దిక్కార స్వరంగా ఆఫ్రికా కవులు గుర్రం సీతారాములు

నల్లకలువలు పూయించిన ప్రజాసాహితి
గుర్రం సీతారాములు

ప్రపంచ వ్యాప్తంగా రచయితలు తమ తమ దేశాల్లో ఏం జరుగుతుందో రాయాలనుకుంటారనేది నిజం. అయితే ఆధునిక ప్రపంచం గురించి విపరీతమైన విషయం ఏమిటంటే తాము పుట్టిన దేశంలో ఏమి జరుగుతుందో వ్యాఖ్యానించడానికి ఎంతో మంది రచయితలు ఇంకొక దేశానికి వలస పోవలసి వచ్చింది. ఈ విషాదం మనం ఆఫ్రికా దేశాలలో చూస్తాం. ఆ క్రమంలో ఆ విషకోరల్లో ఎంతో మంది ఆఫ్రికా కవులు తమ ప్రాణాలను అర్పించారు. మరికొంత మంది దేశ బహిష్కారానికి గురైనారు.

21వ శతాబ్దంలోనికి దూసుకుపోతున్న ప్రపంచ సాహిత్యంలో రష్యా, చైనాల తర్వాత గొప్ప సాహిత్యం నేడు ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాలలోనూ మరియు లాటిన్‌ అమెరికా దేశాల నుండీ వెలువడుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మట్టికాళ్ళ మహారాక్షసిలా పట్టిపీడిస్తూ విశృంఖలంగా వ్యాపిస్తున్న నయావలస విధానం, గ్లోబలైజేషన్‌ మూడవ ప్రపంచ దేశాలను నేడు ఒక తెగులుగా పట్టి పీడిస్తున్నాయి. ఆ క్రమంలో ఆయా దేశాల నుండి వెలువడుతున్న సాహిత్యం నేడు తెలుగు పాఠకులకు అంతంత మాత్రమే అందుబాటులో వుంది.

”రాజకీయాలు తెచ్చే మార్పులకన్నా సాహిత్యం తెచ్చే మార్పులు లోతైనవీ దీర్ఘకాలం నిలబడేవి” అన్నాడు మారియో వెర్గాస్‌ ల్లోసా.

సాహిత్యోద్యమాన్ని ఒక సామాజిక బాధ్యతాయుత కర్తవ్యంగా స్వీకరించి, కాలం చెల్లినా కొనసాగుతున్న కుళ్ళి కంపుకొడుతున్న భూస్వామ్య సంస్కృతిని అంతం చేసే లక్ష్యంతో సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తించి దాన్ని నిరంతరం కాపాడుకుంటూ, భారత సమాజంలో వివిధ చారిత్రక దశల్లో వర్గ సంఘర్షణల ఫలితంగా వ్యాప్తిలోకి వచ్చిన ప్రగతిశీల పురోగామిక సాంస్కృతిక భావజాలాన్నీ కళాసాహిత్యాలనూ ‘జనసాహితి’ తన వారసత్వంగా స్వీకరించింది. అనువాద సాహిత్య సృజన పట్ల ఎంతో శ్రద్ధ వహించి ‘ఆఫ్రికా స్వేచ్ఛా గానం’ పేరుతో ఓ కాలమ్‌ను నిరంత రాయంగా నడిపిన ఏకైక పత్రిక ‘ప్రజాసాహితి’. ఆ అనువాద కృషిని వివరించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

ఆ క్రమంలో వాళ్ళు కెన్‌ సారో వివా, ఒలె సొయింకా, చినువాఅచిబి, గూగీ వా థియాంగో, బ్రేటన్‌ బ్రేటన్‌బా, లియోపాల్డ్‌ సెగార్‌ సింఘార్‌, బెంజిమన్‌ మొలైసీ, పాట్రిస్‌లుముంబా, డెనిస్‌ బ్రూటస్‌, జీన్‌ జోషప్‌, రబి రోవేలా, ఫ్రెడరిక్‌ డగ్లస్‌, సిజైర్‌లాంటి ఎంతో మందిని గూర్చి ఎన్నో విలువైన వ్యాసాలను మరికొంతమంది మీద ప్రత్యేక సంచికలు ‘ప్రజాసాహితి’ తీసుకువచ్చింది. చినువా అచ్‌బీ రాసిన ‘ధింగ్సు ఫాల్‌ ఎపార్ట్‌’ అనే నవలను ‘చెదిరిన సమాజం’ పేరిట తెలుగులోకి అనువాదం చేయించి ప్రజాసాహితిలో ధారావాహికగా ప్రచురించారు. దీనినే జనసాహితి ప్రచురనగా వెలువరించారు. ఆయా సంచికల్లో చర్చించిన ఆఫ్రికన్‌ సాహిత్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

”సంక్షోభ సమయాల్లో సాహిత్యాన్ని రాజకీయాల నుండి విడదీయకూడదు. నిజానికి సాహిత్యం రాజకీయాలలో నిలబడి జోక్యం చేసుకొని సమాజానికి ఉపయోగపడాలి. రచయితలు కేవలం సంతోషపెట్టడానికో గందరగోళంలో ఉన్న సమాజాన్ని విమర్శనాత్మకంగా చూడడానికో రచనలు చేయకూడదు” అని నైజీరియన్‌ రచయితా, ఒగోని ప్రజలనేతా అయిన కెన్‌ సారో వివా వెలిబుచ్చారు. నైజీరియాకు చెందిన కెన్‌ సారో వివా ఇబదానె యూనివర్శిటీలో ఫ్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదివాడు. రివర్స్‌ రాష్ట్రంలో 1941 అక్టోబర్‌ 1న జన్మించిన కెన్‌ సారో వివా, అత్యంత ఫ్రతిభావంతమైన విధ్యార్థి, గొప్ప జాతీయవాది, మహా మేధావి. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ఒగోని ప్రజల స్వయంనిర్ణయాధికారం కోసం హక్కుల కోసం ఉద్యమించాడు. 1970వ దశకంలో గొప్ప సృజనాత్మక రచనలు చేశాడు. వలస పాలనకు వ్యతిరేకంగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామ్రాజ్యవాదానికీ, బహుళజాతి సంస్థ అయిన ‘షెల్‌’ కంపెనీ సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా సమర్ధవంతమైన ప్రజా పోరాటాలను సమీకరించిన వాడు కెన్‌సారో వివా.

1994 మే నెలలో అక్రమంగా అతనితోబాటు 13 మంది ఉద్యమకారులపై హత్యానేరారోపణ చేసి జైల్లో చిత్రహింసల పాలు చేసింది సామ్రాజ్యవాద ప్రపంచ కనుసన్నలలో పనిచేస్తున్న నైజీరియా ప్రభుత్వం. హత్యానేరం తర్వాత ప్రాసిక్యూషన్‌ జరుగుతున్న సమయంలో ఉరిశిక్ష ఖాయం అని తెలిసిన తర్వాత విలేకరులు ఆయన్ను ఇంటర్‌ర్వ్యూ చేస్తున్నప్పుడు మీ సమాధి మీద ఉండే శిలాఫలకం మీద ఏమి వ్రాస్తే బాగుంటుందనుకుంటున్నారని అడగా -

”నైజీరియా పాలకుల చేత మోసపోయిన మర్యాదస్తుడు ఇక్కడ శాశ్వత నిద్రపోతున్నాడు. వారు ఆయనకు ఆరడుగుల నేలను కూడా తిరస్కరించారు” అని వ్రాయమన్నాడు.

కెన్‌ సారో వివా జీవితమూ, పోరాటమూ ఇచ్చిన స్ఫూర్తితో నైజీరియా ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రతి నియంత తాను శాశ్వత మనుకుంటాడు కానీ, ఏ నియంతా శాశ్వతం కాడు. ప్రజలు మాత్రమే సత్యమూ, శాశ్వతమూ. వారి ఉద్యమం ఉద్భవింపజేసిన కెన్‌ సారో వివా వంటి అద్భుత వీరుల్ని బలిగొన్న నియంతృత్వాన్ని వారు తప్పక మట్టి కరిపిస్తారు.

ఆఫ్రికాలో ఫ్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా వచ్చిన సాహిత్యాన్ని, సాహిత్యకారుల్ని, వారి విజయాల్ని తుడిచివేయడానికి ప్రభుత్వం మూర్ఖమైన నిర్ణయం తీసుకుంది. 1966లో ప్రభుత్వ గెజిట్‌ 46గురు ప్రవాసులను చట్టప్రకారం కమ్యూనిస్టులని ముద్రవేసింది. వారిలో పీటర్‌ అబ్రహమ్స్‌, మ్ఫాలేలే, మాడిసేన్‌, థాంబా, మైమానే లాగుమా మొదలైనవారి రచనలను దక్షిణ ఆఫ్రికాలో చదవరాదు. కోట్‌ చేయరాదు అని చట్టం చేసింది. అయినా ఆ చట్టాలను ధిక్కరించి అనేక మంది తమ స్వరాల్ని ఎక్కుపెట్టారు.

దక్షిణ ఆఫ్రికా కవుల్లో డెనిస్‌ బ్రూటస్‌ ముఖ్యుడు. ఇతన్ని ప్రభుత్వం ఏ రాజకీయ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనకుండా నిషేధించింది. 1962లో అతన్ని ఉద్యోగం నుండి తొలగించారు. 1963లో అరెస్టు చేశారు. జైలు నుండి తప్పించుకొనే ప్రయత్నంలో వెన్నులోంచి తుపాకీ గుండు దూసుకుపోయింది. తర్వాత 18 నెలల కారాగారశిక్ష తర్వాత 1966లో దేశాన్ని వదిలి అమెరికా చేరుకొని అక్కడి నుండి వెలి విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు.

ఇతను చిన్నప్పటి నుండి వర్ణవివక్షను అనుభవించాడు. పోర్ట్‌ ఎయిర్‌ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసించి ఇతను చాలా కాలం జైలులోనే జీవితం గడిపాడు.

ఆ సమయంలో అతని ఉద్వేగాలను కవిత్వీకరించాడు. రాయడానికి కాగితం లేకపోతే టాయిలెట్‌ పేపర్‌ మీద కవిత్వం రాశాడు. కానీ విడుదల అయ్యే ముందు అతని సెల్‌ను తనిఖీ చేసి రాసిన కాగితాలను కాల్చి పారవేశారు.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య మెడగాస్కర్‌ లోని ఒక నీగ్రో కవి దీనావస్థకు జీన్‌ జోషఫ్‌ రబెరివేలో జీవితం ఒక ఉదాహరణ. ‘నెగ్రిట్యూడ్‌’ ఉద్యమానికి మూలపురుషుడుగా కీర్తించబడుతున్న రబెరివేలో బాగా చితికిపోయిన ఒక ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ అతను చనిపోయేవరకు అతితక్కువ వేతనం దొరికే ఫ్రూఫ్‌రీడర్‌గానే గడిపాడు.

”వలసవాదుల క్రింద ఒకజాతి సంస్కృతి జీవితం ఎలా అణగారిపోతుందో, వ్యక్తి ఏ రకంగా దోపిడీ చేయబడతాడో, పరాయీకరణ పొందుతాడో, జీవన వైఫల్యం వల్ల కలిగే నిరాశ నిస్పృహల్ని రెబరివేలో కవిత్వం అంతర్లీనంగా వ్యక్తీకరిస్తుంది. మెడగాస్కర్‌లో సాహిత్య పునరుజ్జీవనానికి వైతాళికుడయినా అపారమైన ఏకాకితనం, ఓదార్పులేని జీవితం అతన్ని ఆత్మహత్య చేసుకోటానికి దారితీశాయి.

”మన బ్రతుకుల్నిండా తగినంతగా నల్లటి మట్టి వుంది/ నల్లటి మట్టిలో నల్లని శరీరాలు ఎర్రని కాంక్షల్తో ఎరుపెక్కుతాయి/ నుదుళ్ళని పాటపుట్టడానికి అనువైన కార్యక్షేత్రంగా తయారుచేసి సిద్ధంగా ఉంచా/ ఉరితీతలో ఎదురుకాల్పులో ఏవైతేనేం? ఇవన్నీ స్వేచ్ఛా సముపార్జన ముందు వెంట్రుక ముక్క” అన్న దక్షిణ ఆఫ్రికా జాతీయకవి పోరాటయోధుడు, స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం పోరాడుతున్న దక్షిణ ఆఫ్రికా నల్లకవి విప్లవకారుడు బెంజిమన్‌ మొలైసీని జాత్యహంకార ప్రభుత్వం దారుణంగా ఉరితీసింది.

మాతృదేశ విముక్తికోసం తన కలం అంకితంచేసి స్వేచ్ఛాగానం చేసిన రచయితే దేశాధ్యక్షుడు కావడం చరిత్రలో అరుదైన విషయమే. కవీ, రచయితా, సాహితి సిద్ధాంత కర్త అయిన లియోపాల్డ్‌ సెగార్‌ సింఘార్‌ తన దేశ అధ్యక్షునిగా పనిచేశాడు. ఈయన ప్రపంచపు నాగరికతా విలువలను సమ్మిళితం చేసి ‘నెగ్రిట్యూడ్‌’ అనే పేరును మరో రచయిత అయిమీ సిజైర్‌తో కలిసి సిద్ధాంతీకరించారు. ఆయన ఆఫ్రికాలో గొడ్గూ గోదా కాస్తూ పొలాలవెంట తిరుగుతూ యధేచ్ఛగా గడిపాడు. తొలినాళ్ళలో ఆఫ్రికన్‌ జీవసారమూ, జీవిత విధానమూ అతని రక్తంలో ఇంకిపోయాయి. ఫ్రెంచి భాషా సాహిత్యాలను అధ్యయనంచేసి బోదలేర్‌ మీద పరిశోధన చేశాడు. ఈ దశలోనే కవిగా రాజకీయవాదిగా రూపొందాడు.

”ఆఫ్రికన్స్‌కి ఎలా జీవించాలో నేర్పడం ఫ్రెంచి వాళ్ళ ఆలోచనయితే ఆఫ్రికాయే ఫ్రెంచ్‌వాళ్ళకు ఎలా జీవించాలో నేర్పగలద”ని సెంఘార్‌ ధృఢనమ్మకం.

”ఆఫ్రికన్‌ సంస్కృతి అనేది దాని మట్టుకు అది పరిమితమైంది కాదనీ, ప్రపంచానికది కొత్త దృక్పథాన్ని ఇవ్వగలిగేదనీ, ఒక విశ్వజననీయ సంస్కృతిని రూపొందించడానికి అది మార్గదర్శకమివ్వగలదని, అది కవిత్వానికి అంతర్లయ” అని నెగ్రిట్యూడ్‌కు ఆయనిచ్చిన నిర్వచనం.

”బ్లాక్‌ విక్టిమ్స్‌” అనే పేర ఆయన రాసిన కవితలు అన్ని రకాలుగా అత్యున్నత స్థాయినందుకున్నాయి. తన జీవితపు పునాదులు, క్రిష్టియానిటీలో ఉండటంవల్లనో, పురాతన సంస్కృతిపట్ల మోజు వల్లనో, ఆఫ్రికన్‌ జీవిత విధానంపట్ల తరగని ఆకర్షణ ఉండటంవల్లనో, సెంఘార్‌ ఎప్పుడూ కమ్యునిస్టు కాలేకపోయాడు. మార్క్సిస్టు కాలేకపోయాడు. పైగా మార్క్సిజం యూరోపియన్‌ దేశాలకు వర్తిస్తుందనే గుడ్డినమ్మకం, మార్క్స్‌ సూచించిన వర్గాలు తమ దేశంలో లేవని అపోహ ఆయన్ను మార్క్సిజం వైపు మొగ్గనీయకుండా చేశాయి. ఏది ఏమైనా ఓ వైపు ఊపిరి సలపని రాజకీయాల్లో పాల్గొంటూ తన దేశ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాంక్షించి విరామమెరుగక పోరాడుతూ ఆ పోరాటానికి తన కవిత్వాన్ని అంకితం చేసిన ఆఫ్రికన్‌ సహజకవి సెంఘార్‌.

ఆఫ్రికా తరచుగా తగులబెట్టబడి, శిధిలపర్చబడి, స్వచ్ఛపరచబడి మంటకు మారుపేరుగా నిలబడుతుందని మాతృభూమి స్వేచ్ఛకొరకు అంతర్మధనపడ్డ ఆఫ్రికా కవి బ్రేటన్‌ బ్రేటన్‌ బా. ప్రజల పోరాటానికి ప్రతీక అయిన డెనిస్‌ బ్రూటస్‌. స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పోరాడిన బెంజిమన్‌ మొలైసీ, వలసపాలనలో జీవన వైఫల్యాలను పలికించిన జీన్‌ జోషప్‌ రబెరో వెలా లాంటి వాళ్ళు ఎందరో మేధావులు, కవులు, కళాకారులు ఆఫ్రికా సాహిత్య, సాంస్కృతికోద్యమానికి తమ జీవితాలను త్యాగం చేశారు. వారిని గుర్చిన అనేక కవితలు, వ్యాసాలు, ఎంతో విలువైన సమాచారాన్ని అనువదించారు ‘ప్రజాసాహితి’ వారు.

”నియంతృత్వం ముందు నిశ్శబ్దంగా ఉండే అందరిలో మనిషి చచ్చిపోతాడని” నినదించిన మరో నల్లజాతి కవి ఒలె సోయింకా. నైజీరియాకు చెందిన ఇతను నోబెల్‌ బహుమతిని అందుకున్న మొదటి నల్లజాతి కవి. 1986న బహుమతి స్వీకరిస్తూ చారిత్రకమైన ఉపన్యాసాన్ని ఇచ్చాడు. దాన్ని నెల్సన్‌ మండేలాకు అంకింతం ఇచ్చాడు.

నైజీరియాలో అభికుటి పట్టణంలో మత ప్రచారకుల కుటుంబంలో పుట్టిన ఇతని బాల్యమంతా మత వాతావరణంలోనే గడిచింది. అంతేకాకుండా స్వయంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. 1965లో నైజీరియా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్యాయాలు జరిగినా వాటిని ప్రభుత్వం రేడియో ప్రచారం చేయలేదు. అప్పుడు సొయింకా రైఫిల్‌తో రేడియో కేంద్రంలోకి ప్రవేశించి ఎన్నికల్లో అన్యాయాల్ని గూర్చి ప్రసారం చేయమని సిబ్బందిని భయపెట్టాడు. ఆ నేరానికి అతను శిక్ష అనుభవించవలసి వచ్చింది.

”ప్రపంచాన్నంతా ”నాగరీకం” చేస్తామనే ‘ఉద్యమానికి’ వారు చూపించిన కారణం తాము తప్ప ఇతరులు నాగరిక మానవులే కాదన్న దృక్పథమే”నంటూ ప్రపంచవ్యాప్తంగా వలసవాదాన్ని ప్రోత్సహించిన నాగరిక దేశాల గుట్టు విప్పారు సొయింకా. ప్రపంచ వ్యాప్తంగా విముక్తి యుద్ధాల వేదన అనుభవించిన మరికొన్ని దేశాల నేల మీద ఇంకా అజ్ఞాత అమరవీరులైన అమాయకుల మృతకళేబరాళు పచ్చిగా పడి ఉన్నాయి. ఈనాడు ఆ దేశాల్లోని ప్రజలు తమను ఒకనాడు బానిసల్ని చేసిన వారితో కలిసి పక్కపక్కనే జీవిస్తున్నారని విమర్శించిన ధైర్యశాలి ఒలె సొయింకా.

కెన్యా దేశానికి చెందిన మరో మేధావి, కవి నవలా రచయిత గూగీ వా థియాంగో. ఇతను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినవాడు. ‘డికాలనైజింగ్ ద మైండ్‌’, ‘మాటిగిరి’, ‘పెటల్స్‌ ఆఫ్‌ ద బ్లడ్‌’, ‘ది రివర్‌ బిట్వీన్‌’, ‘డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌’, ‘ప్రిజన్‌ నోట్స్‌’, ‘గాహికా దీండా’ లాంటి ప్రసిద్ద రచనలు ప్రపంచానికి అందించాడు. స్వదేశంలో ఎన్నో శతృ నిర్బంధాలకు గురై ఉద్యోగాన్ని వదిలి డిటెన్యూగా మారాడు. అలా జైలులో ఉంటూనే టాయిలెట్‌ పేపర్‌ మీద తన భావాలకు అక్షర రూపం ఇచ్చాడు. అక్కడ శతృ నిర్బంధాలు ఎంత కఠినంగా ఉండేవంటే నిర్బంధించే అధికారులు కేవలం గాయపర్చడంతో తృప్తి చెందరు. ఆ గాయం లోకి ఎప్పుడూ వేడి కత్తులు దూర్చి తిప్పుతూ అది మానకుండా ఉండాలని చూసే క్రూరులు వాళ్ళు.

నైరోబి విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్‌ విభాగంలో పనిచేస్తూనే వలసపాలనకు చిహ్నమైన ఆంగ్లం స్థానంలో ఆఫ్రికా భాషలను అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతను గుర్తెరిగి వాటి వ్యాప్తికి పరిశోధనకు పెద్దపీటవేయాలని తమ మాతృభాష అయిన గికుయు భాషలో తన రచనను కొనసాగించాడు.

”సాంస్కృతిక సామ్రాజ్యవాదమే మానసిక అంధత్వాన్నికి, బధిరత్వానికి జన్మనిస్తుంది. అది ప్రజలు తమ దేశంలో తామేం చేయాలో విదేశీయులే నిర్ణయించేలా చేస్తుంది” అని పాశ్చాత్య సంస్కృతి మీద కత్తి గట్టిన గూగీ కుటుంబం నిత్యం కల్లోలాలతోనే సహజీవనం సాగిస్తోంది. గూగీ కొడుకు ‘మకోమ’ కూడా మంచి రచయిత.

పైన పేర్కొన్న కవులూ, రచయితలూ వారి ఆచరణ, ప్రాపంచిక దృక్పథాన్ని పరిశీలించినట్లయితే వారిలో ఎక్కువ మందికి మార్క్సిజం పట్ల గల అచంచల విశ్వాసాన్ని గమనించవచ్చు. ఆఫ్రికాలో ఆయా దేశాల్లో జరిగిన వలసవాద వ్యతిరేక పోరాటాలు, స్వాతంత్రోద్యమ పోరాటాలు మన రాష్ట్రంలో జరిగిన సాహిత్య సాంస్కృతికోద్యమాలకూ కొంత సారూప్యత ఉంది. ఉదాహరణకు కెన్యాలో జరిగిన మౌ మౌ విముక్తి పోరాటం (1952-56)కు మన తెలంగాణా సాయుధ పోరాటం, శ్రీకాకుళ పోరాటాలకు సారూప్యత గమనించవచ్చు. వీటి రూపాలు వేరయినా సారం ఒక్కటే.

మౌ మౌ విముక్తి పోరాటంలో స్వయంగా పాల్గొన్న జోమొకెన్యట్టా (మన నెహ్రూలాగే) ఓ బహురూపి. అక్కడ కెన్యట్టా సహచరులు ఎంతో మంది టెర్రరిస్టులుగా ముద్ర వేయబడి డిటెయిన్‌ చేయబడ్డారు. చిత్రహింసలు అనుభవించారు. కెన్యా మౌ మౌ సాయుధ పోరాటం గురించి గాదరింగ్ సీ వీడ్‌ (Gathering Sea weed: African Prison Writing) అనే పుస్తకాన్ని సమకూర్చి ముందుమాట రాసిన జాక్‌మపంజీ మాటల్లో ”కెన్యాలో కెన్యట్టాతో బాటు ఎంతో మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులు, కవులు, రచయితలు ప్రాణాలు లెక్కచేకుండా చిత్రహింసలు అనుభవించారు. ఇక్కడ విచారకరమైన విషయమేమంటే కెన్యాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ నాయకుడి హోదాలో కెన్యట్టా ఒకప్పుడు తన సహచరులను, తర్వాత అతనితో రాజకీయంగా విభేదించిన కవులను, మేధావులను అంతరంగిక భద్రతా చట్టం పేరుతో ఎంతో మందిని తీవ్రవాదుల నెపంతో అరెస్టు చేయించాడు. అందులో ఎక్కువ భాగం నష్టపోయినవాడు గూగీ వా థియాంగో. ఇతను కెన్యట్టా మరణం తర్వాతనే విడుదల చేయబడ్డాడు”.

కెన్యట్టాను చూసి ఆ దేశ ప్రజలు ఎన్ని భ్రమలు పెంచుకున్నారో మన దేశంలో కూడా కొందరు కమ్యునిస్టులు నెహ్రూ జేబుకు ఉన్న ఎర్ర గులాబీలో సోషలిజాన్ని చూసినవారూ ఉన్నారు. తెలంగాణ పోరాట (1948-51) కాలంలో ప్రజలే ‘రంగురంగుల మారి నెవురయ్యా! నీ రంగు బయిరంగ మాయె నెవురయ్యా! తేనె పూసిన కత్తి నీవు నెవురయ్యా’ అని పాటలు పాడారు.

”స్వాతంత్య్రాన్ని వాంఛిస్తామని ఓ వైపు ప్రకటిస్తూనే మరో వైపు ఆందోళనను నిరసించేసేవాళ్ళు, అరక దున్నకుండా పంట పండాలని కోరుకునేటటువంటి వాళ్ళు, ఉరుములు మెరుపులు లేకుండా వాన కురవాలనుకొనేవాళ్ళు, సముద్రం హోరెత్తకుండా ఉండాలనుకునేవాళ్ళు” అని నల్లజాతి నాయకుడు ఫ్రెడరిక్‌ డగ్లస్‌ చేసిన వ్యాఖ్య విశ్వజననీయమైంది. ఇది మన రాష్ట్రం లోనూ కొన్ని సమూహాలకు వర్తిస్తుంది.

ఇలా ఒకనాటి చీకటి ఖండం నల్లని సంకెళ్ళను తెంచుకొని తమ మనుగడకోసం పోరాటాన్ని ఏనాడో ప్రారంభించింది. ఆ పోరాటాల్లో జాతీయతను సుస్థిరం చేసుకొనే లక్ష్యం నుండి ప్రజారాజ్యాలకోసం తపనపడే విముక్తి పోరాటాలే దాని సంకేతంగా మారాయి.

కవులూ, కళాకారుల మీద నిర్బంధాలు స్థలకాలకు అతీతంగా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నవే. ఆక్రమంలో మన రాష్ట్రంలో ఎందరో మేధావులు కృషి చేశారు. నమ్మిన విశ్వాసానికి తన ప్రాణాలను అర్పించారు. వాళ్ళంతా వ్యవస్థలోని అసమానతలకు కలత చెందారు. కాబట్టే అలా రాయగలిగారు.

వ్యస్థలోని అపసవ్యత కళాకారుడికి ప్రేరణ కావాలి. తత్‌ఫలితంగా కళారూపం నిలవాలి.

A poet’s mind exudes poetry only when he is disturbed. Only turblance roduces some thing worth remembering.

ఆఫ్రికాలోని కవులూ, మేధావులూ ఆ వ్యవస్థకు కలత చెందారు కాబట్టే ఇప్పుడు మనం చర్చించిన ఇంత సృజన రాబట్టగలిగారు.

ఎంతో హింసను మనం నిత్యం చూస్తున్నాం. దమనకాండను అనుభవిస్తున్నాం. అభద్రతా భావంతో, భావ ప్రకటనా స్వేచ్ఛను పాక్షికంగానే అనుభవిస్తున్నాం. అది వాకపల్లి మహిళల ఆర్తనాదం కావచ్చు. మరి ఏదండి సృజన?

”దేహాన్ని చంపేవాళ్ళంటే భయపడనక్కర్లేదు కానీ, చైతన్యాన్ని చంపేవాళ్ళంటేనే భయపడాలి. వాళ్ళు ఇతరులను చంపినట్లే నన్ను కూడా చంపినప్పటికీ, నా చైతన్యాన్ని మాత్రం చంపెయ్యలేరు. స్వతంత్రంగా నిలబడాలనే ఈ దేశం సంకల్పాన్ని వాళ్ళు చంపలే”రని సామ్రాజ్యవాదుల నుద్దేశించి వరరు కాంజా చేసిన ప్రకటన కేవలం ఆఫ్రికాకే పరిమితం కాదు. ఇది విశ్వవ్యాప్తం అవుతుంది.

ఇక్కడ కేవలం ”వ్యక్తులను” నిర్మూలించే పనిలో ఉన్నవాళ్ళు ”చైతన్యాన్ని” మాత్రం ఎప్పటికీ చంపలేరని ఎన్నాళ్ళకు తెలుసుకోవాలి?

References:

1. Gathering sea weed
African prison Writing/ Edited by Jack Mapanje. (Heinemann ప్రచురణ: 2002).
2. Mau Mau Patriotic Songs - a letter from Prison kinathi
3. Ken Saro Wiwa - Defence Statement.
4. N.Gugi - Refusing to Die/ toilet paper
5. N.Gugi - Devil On the Cross/ Matigiri/ Prison notes
6. ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు - నిఖిలేశ్వర్‌
7. ‘ప్రజాసాహితి’ ప్రత్యేక సంచికలు - 1980-2000
8. Literature for Composition/ Harper Collins Publication by Sylan Bernet
9. Chinua Achibe - Death and Kings Horseman


ప్రపంచ సాహిత్యం, సాహిత్య వ్యాసాలు

2 అభిప్రాయాలు
vemuganti మార్చ్ 2008 1

african literature meeda manchi essay

koresh ఏప్రిల్ 2008 2

సహిత్య విద్యర్దికి తెలిని ఇన్ని విషయాలు ఉన్నయా

Hiç yorum yok: