డా కానూరి హరీష్ స్మృతిలో …
ప్రాణహిత
నీవు లేవు నీ మాట ఉంది…
- గుఱ్ఱం సీతారాములు.
వైద్యవృత్తినివదిలి సమాజానికి శస్త్రచికిత్స చేయడం కోసం ప్రాణాలర్పించిన
డా|| చాగంటి భాస్కరరావు త్యాగం గూర్చి మనకు తెలుసు.
పౌరహక్కుల ఉద్యమంలో రాజ్యం కసాయి తనానికి బలి అయిన డా|| రామనాధం కూడా తెలుసు.
వారి స్ఫూర్తితో శాస్త్రీయ అవగాహన, సేవానిరతి, త్యాగం అలపర్చుకొని ప్రజలకు వైద్య సేవలందిస్తూ వచ్చిన
ఖమ్మం పట్టణ ప్రముఖ వైద్యులు డా|| కానూరి హరీష్ మనకికలేరు.
వారు సెప్టెంబర్ 22, 2006న కన్నుమూసారు.
తెలంగాణాలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవారిలో కాకతీయ వైద్య విద్యార్ధుల పాత్రగానీ,
ఉస్మానియా ఇంజనీరింగు విద్యార్థుల పాత్రను గానీ తక్కువగా అంచనా వేయలేము.
ఆ క్రమంలో డాక్టర్లలో మొదట అమరులయింది డా|| రామనాధం అయితే రెండో వ్యక్తి డా|| అంకం బాబూరావు.
తెలంగాణా వైద్య విద్యార్ధుల కార్యకలాపాలను గూర్చి రాసేటప్పుడు ఆ ఇద్దరినీ జ్ఞాపకం చేసుకోవాలి.
మహోన్నత నక్సల్బరీ, శ్రీకాకుల రైతాంగ పోరాటాల స్ఫూర్తితో కాకతీయ వైద్య విద్యార్ధులు,
అందున 1960 - 70 చివర రోజుల్లో ఆ భావాజాలాన్ని అందుకున్న మొదటి తరం వాళ్ళలో డా|| హరీష్ ఒకరు.
డా|| హరీష్ 1942 నవంబర్ 2న క్రిష్ణాజిల్లా పెదమద్దాలి గ్రామంలో జన్మించారు.
ఖమ్మంలో స్థిరపడి, వైద్యవృత్తిని అభ్యసించడం కోసం 1962లో వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో చేరారు.
అందరూ ఊహిస్తున్నట్లు వైద్య విద్యార్ధులు కేవలం పుస్తకాల పురుగులు కారని,
వారిలో సామాజిక స్పృహ ను రగిల్చితే సమాజానిక వారెంతో సేవ చేయగలరని నిరూపించిన మొదటి తరం విప్లవ విద్యార్ధుల్లో డా|| హరీష్ ఒకరు.
ఒక మనిషి కమ్యూనిస్టు అయినప్పుడు కమ్యూనిస్టు సంస్కృతిని ఆచరిస్తాడు.
దానికి నిదర్శనంగా వైద్యం చదివే రోజుల్లో వాళ్ళంతా కమ్యూన్ జీవితాన్ని అలవర్చుకొన్నారు.
అక్కడే డా|| కావూరి రమేష్‌బాబు, వాసిరెడ్డి రామనాథం తదితరులు వీరి సహ విద్యార్ధులు.
వీరంతా 60, 70వ దశకాలలో ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమాల పట్ల సహజంగానే ఆకర్షితులైనారు.
కొందరు వ్యక్తులు ఈ సమాజంలో వైరుద్యాల పరిష్కారానికి పోరాటాల ద్వారా రాజకీయరంగంలో ఉండి ప్రయత్నిస్తే,
మరికొందరు ‘ప్రజలకుసేవ’ అనే విలువ ద్వారా, ఆచరణ ద్వారా,
సాంస్కృతిక రూపంలో సాంస్కృతిక రంగం ద్వారా ప్రయత్నిస్తారు. నాకు తెలిసి ఆచరణ ద్వారా,
నమ్మిన విశ్వాసానికి, వ్యక్తిగత ఆచరణకు తక్కువ వైరుధ్యాలున్న వ్యక్తులలో డా|| హరీష్ ఒకరు.
ఆ విషయం వారి ఆచరణ, వాళ్ళ ఇంట్లో పనిచేసేవారిని, వారి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను అడిగితే తెలుస్తుంది.
డా|| హరీష్‌కు సాహిత్య, సంస్కృతిక రంగాలతో గత మూడు దశాబ్దాలుగా ఉంది.
ఆయా సంస్థల పట్ల సానుభూతి పరుడుగా ఆయన చేసిన కృషి అసమాన్యమైనది.
చారిత్రిక విరసం మొదటి మహాసభ నిర్వహణకాని,
రైతు కూలీ సంఘం సభకాని, ”చెరబండరాజు స్మారక పురస్కారం” పేరుతో
ప్రగతిశీల కవులకు ఇస్తున్న చేయూత చూస్తే వారి భావ జాలం ఏమిటో తెలుస్తుంది.
అసాధారణ ప్రతిభాపాటవాలు ఉన్న వారికి సంగీతం అన్నా, సినిమా అన్నా అత్యంత ప్రీతిపాత్రమైనవి.
లక్షలాది రూపాయలతో ఆయన సేకరించిన విలువైన పుస్తకాలు, సినిమాలు, మ్యూజిక్ క్యాసెట్లు, ఇందుకు సజీవ సాక్ష్యాలు.
మార్కెట్లోకి వచ్చిన ప్రతి పుస్తకాన్ని దాదాపు నాల్గు దశాబ్దాలుగా సేకరించారు.
సేకరించిన పుస్తకాలు కేవలం అలంకరణ కోసం కాదని, నిత్యం చదువుతూ,
చదివేవారిని ప్రోత్సహిస్తూ, జీవితాంతం పుస్తకాల మధ్యనే గడిపారు.
ఆ క్రమంలోనే వారు నాకు అలగ్జాండర్ కుప్రిన్, ఆల్బర్ట్ మురావియో, సాల్‌బెల్లో తదితర రచనలను పరిచయం చేసి ప్రోత్సహించారు.
కొందరు తన వారసులకు బంగారం, భవనాలు ఇస్తారు.
హరీష్‌గారు తన వారికి లక్షలాది పుస్తకాలను, సినిమాలను,
విలువైన పెయింటింగులను ఉదారమైన తన భావజాలాన్ని ఇచ్చి వెళ్ళారు.
మంచివిమర్శకులైన హరీష్ ‘రామారావు’ పేరుతో మంచి కథలు వ్రాశారు.
తానే స్వయంగా ‘స్వేచ్ఛ ప్రచురణ’లు పేరుతో క్రిస్టఫర్ కాడ్‌వెల్, ఫాలోఫ్రేయిరీ, గ్రాంసీ,
ఏ.పి. యట్ క్రాస్ రోడ్స్ తదితర రచనలను తెలుగువారికి అనువదింపజేసి అందించారు.
ప్రముఖ విప్లవ కవి ‘శివసాగర్ సాహిత్యం’ మొత్తం ఒకే సంకలనంగా వేసి
నాతో ప్రతి కవితకు పుట్‌నోట్స్ వ్రాయించి, అచ్చు వేయించారు.
1970 నుండి రావిశాస్త్రి, కారా మాస్టారు, శ్రీపాద, వేగుంట,
పతంజలి లాంటి సాహితీవేత్తలను ఖమ్మం రప్పించారు.
‘చేరా మాస్టారు అభినందన సభ’కు తానే గౌరవాధ్యక్షులుగా ఉండి గొప్పగా నిర్వహించారు.
మితభాషి, సునిశితమైన పరిశీలన కలిగినవారు
మన ‘శ్రీశ్రీ’ అనే కవితలో శ్రీశ్రీ గురించి చెప్పడం చరిత్ర ముడివిప్పడం గత కాలపు కందిరీగ తుట్టెను కదిలించడం ఒక శతాబ్దాన్ని ఇంతగా కల్లోలపరిచిన కొద్ది మందిలో శ్రీశ్రీ ఒకరని గొప్ప విశ్లేషణ చేశారు.
నేటి మనిషి మానవ సంబంధాలను , అనుబంధాలను డబ్బుతోనే మారకం వేసుకుంటున్నాడనీ, మనిషి పరాయికరణకు గురైన వస్తువని, డబ్బు ఖర్చు పెట్టనిదే మనిషి శవం చుట్టూ చేరి కన్నీరు కార్చడానికి కూడా ఎవరికీ తీరికలేదని,
సమాజపు సందుల్లో ఒక రాబోట్‌లా, పందిలా మిగిలాడని, నేడు మరో తెల్ల దేశపు బానిస కాబోతున్నాడనీ, బానిసగా అమ్ముడుపోబోతున్నాడని మానవ నైజాన్ని వివరించారు.
చరిత్రలో వెనుక నడిచే వారికి బాట చూపించడానికి నేడు రక్త తర్పణ తప్పదనీ, రక్తంతోనే రహదారి వేయాలనీ,
లేకపోతే దారి తప్పుతారనీ, పరోక్షంగా ఈ దేశంలోనే సాయుధ పోరాటాన్ని సమర్ధిస్తూ చెప్పిన విషయాన్ని గమనించవలసి ఉంది.
అలాసాగే ఈ క్రమంలో పతితులు, భ్రష్టులూ, మూలనున్న ముసలవ్వలు, దగాపడిన తమ్ముళ్ళు, దౌర్భాగ్యులు మరి జేబుదొంగలు అందరూ ఒకరుగా ఏకంకాక తప్పదనీ, ఈ సమాజం సృష్టించిన దిష్ఠిబొమ్మలు వాళ్ళు అని వాపోయారు. ఎంతో వ్రాయగలిగే సామర్థ్యం ఉండి, వ్రాయకుండా ఉన్న ఆయన నిర్లప్తతను నేను ఒకసారి ప్రశ్నించాను.
”నేను ప్రస్తుతం జీవించే జీవితానికి, ఆచరణకు వైరుద్యం ఉందని అందుకే రాయాలని అనిపించడం లేదని చెప్పారు”.
అందుకే ఇన్ని వైరుద్యాలున్న ఈ వ్యవస్థలో మనిషి కనుమరుగు అవుతున్నాడని అన్నారు.
అయినా వైద్యరంగంలోనే తన జీవిత చరమాంకాన్ని గడిపారు.
ఖమ్మం - ఫిలింసొసైటీ, పూలె - అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జనవిజ్ఞాన వేదిక, రెడ్‌క్రాస్, సాహితీ స్రవంతి, virasam ku sannihitudu gaa ....
లింబ్‌సెంటర్ తదితర 20 సంస్థలు వెతుక్కుంటూ హరీష్‌ను గౌరవధ్యక్షునిగా చేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు.
వారిని ఉత్తేజపర్చింది కమ్యూనిస్టు విప్లవ భావజాలం గనుకనే ఆయన ఇలా ధృడ చిత్తంతో తుదకంటూ తన కృషిని కొనసాగించగలిగారు.
ప్రతిరోజు సాయంత్రం స్థానిక ప్రజాశక్తి పుస్తకాల షాపులో సాహితీ మిత్రులతో రెండు, మూడు గంటలు గడిపే అలవాటు.
ఎంతో మంది డాక్టర్లు, కవులు, కళాకారులు, విద్యావేత్తలు ఆ సాయంకాల సమయాన్ని పంచుకొనే వారు.
ఆ మిత్ర బృందంలో అత్యంత చిన్న వయస్సు నాదే. ఆయన నా పట్ల ప్రత్యేక వాత్సల్యాన్ని చూపేవారు.
ఖమ్మం నెహ్రునగర్‌లోని హరీష్ గారి నిలయం ”నెలవంక”. నిత్యం సాహితీ మితృలకు చల్లని పందిరి.
కొత్త ఆకాశాలకోసం అరమోడ్సు కళ్ళతో తలపించిన ‘నెలవంక’ కలల్లేని తనంతో వెలవెల బోతూంది.
ఇప్పటికీ సాయంకాల సమావేశాలం కొనసాగుతూనే ఉన్నాయి.
కాని వారి కుర్చీ ఖాళీగానే ఉంది. ఆ శూన్యాన్ని మేము భరించలేకుండా ఉన్నాం.
మా కవి మిత్రుడు షుకూర్ మున్నేటి ఒడ్డున విగత జీవిగా ఆయన భౌతికకాయం చితిమంటలలో చూసి చలించి ఇలా చెప్పారు
”నువ్వులేవు నీ మాట ఉంది.
ఆఖరి సభలో అశువ్రులే పేక్ష్రకులు
నీ జ్ఞాపకాలు తప్ప ఏవిూ కనిపించలేదు
ఒక్క నీ మౌనం తప్ప
ఏవిూ వినిపించలేదు”…
* * *
ఆ రోజులు - డాక్టర్ హరీష్
- వరవరరావు
1968 లో వరంగల్ ఆంధ్ర విద్యాభివర్ధిని జూనియర్ కళాశాలలో వరంగల్ జిల్లా రచయితల సభలు జరిగాయి. అందుకు పూనుకున్నవాళ్ళు ముఖ్యంగా సంపత్ కుమార్, సుప్రసన్న, యం.ఎస్. ఆచార్య (జనధర్మ సంపాదకులు), జగదీశ్వర్‌రావులు అనుకుంటాను. అప్పటికి వరంగల్ ఆర్ట్ ్స కాలేజిలో తెలుగు లెక్చరర్‌గా ఉన్న నర్సింహారెడ్డి ఇటువంటి సాహిత్య సౌరంభంలో క్రీయాశీలకంగా ఉండేవాడు. ఆయన పట్టుదల వల్లనే నన్ను ‘రచయిత-నిబద్ధత’ అనే అంశం మీద ప్రసంగ వ్యాసం చదవాల్సిందిగా పిలిచాడు. నేను అప్పుడు జడ్చర్లలో పనిచేస్తున్నాను. సృజన అప్పటికే (1966) ప్రారంభమైంది. ఆ సభల్లోనే పి.వి. నర్సింహారావు అధ్యక్షతన రెండవరోజు ముగింపు సమావేశంలో కవి సమ్మేళనం జరిగింది.
రెండవ రోజు అనుకుంటాను నేను నా ప్రసంగ వ్యాసం చదివాక, భోజన విరామ సమయంలో ‘విూతో మాట్లాడాలి మేము కాకతీయ వైద్య కళాశాల విద్యార్ధులం సృజన పాఠకులం’ అని నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు కనీసం 8 మంది ఉంటారు. నాకు స్పష్టంగా గుర్తున్నవాళ్ళు మాత్రం ఒకరు రావి భుజంగరావు, ఇంకొకరు డాక్టర్ హరీష్. ఎ.వి.వి. జూనియర్ కాలేజీ (మొదట ఉన్నత పాఠశాల) యం.జి.యం. ప్రక్కనుండి బట్టల బజారుకు వెళ్ళే రోడ్లో అప్పటి జయభారత్ టాకీస్ ఎదురుగా డౌన్‌లో ఉంటుంది. బయటకు వచ్చి ఆ టాకీస్ ఎదురుగా ఉన్న చిన్న కాకా హోటల్లో కూర్చున్నాము. అందరూ నా కన్న బలంగా ఉన్నారు. వయస్సు కూడా నాకు అప్పుడు 28 ఏళ్ళే. వాళ్ళు 20 ల్లో ఉవారు. మాటల్లో వారందరూ సాహిత్యం సంగతి ఎలా ఉన్నా, మార్కి ్సస్టు జ్ఞానంలో నాకన్న పెద్ద వాళ్ళని కాసేపటి చర్చల్లోనే అర్థమైంది.
‘మేమంతా రెగ్యులర్‌గా ‘సృజన’ పత్రిక చదువుతాం. సృజన ఆధునిక సాహిత్య వేదికగా ఒక ప్రయోగం. ప్రగతి శీలత, శాస్త్రీయ దృక్పధం కలిగి ఉంటానని ప్రకటించుకున్నందుకు మాకు మీతో ఈ చర్చ చేసే అవకాశం కలిగిందనుకుంటున్నాం. శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో ? ప్రగతి అంటే ఏమిటో గందరగోళం ఏమి లేదు. ప్రయోగం అంటేనే ఎటువంటి ప్రయోగం, దాని ప్రయోజనమేమిటి’ ? అనే ప్రశ్నలు వస్తాయి అని ప్రారంభించారు. ఇదే మాటలు కాకపోవచ్చు గాని భావం ఇదే. అయితే రక్త చలన సంగీత శృతి (సృజన మూడవ సంచికలో ప్రచురితమైన చందనం అనే విద్యార్థి కవిత) దాని ప్రక్కన ‘చల్లనలో తెల్లన- తెల్లనలో చల్లన’ (సంజీవదేవ్ వ్యాసం) అనే వాక్యానికి అర్థం ఏమిటి అని ప్రశ్నించారు. ”మీకు ఒక స్పష్టమైన సాహిత్య దృక్పథం ఉండాలి” అని హితవు చెప్పారు. అప్పటికి నేనేమో ఇంకా చాలా ప్రభావాల్లో ఉన్నాను. నక్సలబరీ గురించి కూడా నాభి గర్భంగా తెల్సుకున్నానో, లేదో నాకు అట్లా మొదటి పాఠం చెప్పిన వైద్య కళాశాల విద్యార్ధుల్లో డాక్టర్ హరీష్ ఒకరు. బహుశ అప్పటికి ఆయన, డాక్టర్ కవూరి రమేష్ బాబు, డాక్టర్ కరుణ మొదలైన వాళ్ళు చదువు పూర్తి చేసుకోబోతున్నారు. కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తి డాక్టర్ నాగేశ్వరరావులతో కలిసి వరంగల్‌లో విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఉన్నారు. అట్లా నాకు హరీష్‌తో తొలి పరిచయం అయింది.
కొద్ది రోజుల్లోనే 1968 అక్టోబర్‌లో నేను అదే కళాశాల ఆవరణలో ప్రారంభమైన చందా కాంతయ్య స్మారక కళాశాలలో వచ్చి చేరాను. ‘సృజన’ వరంగల్‌కు మారింది. సి.కె.యం. కాలేజ్, పోస్టుబాక్స్‌నెం. 67 చిరునామాయే అప్పటి సృజన చిరునామా. రోజు కె.యం.సి. మీదుగానే సి.కె.యం.కు ప్రయాణం. హనుమకొండ నుండి ఎక్కడో ఒకచోట ఈ బృందం కలుస్తూ ఉండేది.
సృజన 1969 కల్లా ”ట్రిగర్ మీద వేళ్లతోరా…” అని స్పష్టమైన పిలుపు నిచ్చే సాహిత్య పత్రికగా మారిపోయింది. యువతరానికి ‘ఆయుధాలకు పిలుపు’ (కాల్ టు ఆర్మ్ ్స) ఇచ్చిన సుప్రసిద్ధ చైనా రచయిత లూస్సన్ సాహిత్యం తరువాత రోజుల్లో చదివాను. డాక్టర్ హరీష్ అప్పటికే భారతి, యువ లాంటి పత్రికల్లో కథలు వ్రాసి ఉన్నాడు. నాకు కలిసిన వైద్య విద్యార్థి బృందంలో స్వయంగా రచయితలు, రాజకీయాలతో పాటు సాహిత్యాభి నివేశం ఉన్నవాళ్ళు కూడా హరీష్, భుజంగరావులే. ఇంకా అక్కడ నుండి ఉద్యమమే మా ఊపిరి.
జూలై 4, 1970న హైద్రాబాద్‌లో విరసం ఏర్పడింది. అర్థరాత్రి ఆవిర్భవించిన విరసం చరిత్ర అందరికి తెలుసు. ఆ చారిత్రక పత్రంపై సంతకం చేసినవారిలో భుజంగరావు ఒకరు. డాక్టర్ హరీష్ అప్పటికే వైరాలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
ఖమ్మంలో విరసం ప్రథమ మహాసభలు :
అడహాక్ కమిటీతో విరసం ఏర్పడ్డాక మహా సభలు ఎక్కడ పెట్టాలి అనే చర్చ వచ్చింది. అప్పటికే ‘దిగంబర కవులను’ ఖమ్మం తీసకవెళ్ళి సంచలనాత్మక సభ నిర్వహించి ఉన్న క్రాంతికార్ విరసం సభలను నిర్వహిస్తామని ముందుకు వచ్చారు. ఖమ్మంలో నిర్వహిస్తామని అన్నా ఆ క్రాంతికార్ వెనక ఉన్న శక్తి డాక్టర్ హరీష్, రంగయ్య గారు ఇంకా చాలా మంది విప్లవాభిమానులు. కె.వి. సుబ్బారావు లాంటి న్యాయవాదులు ఉన్నారు. అక్కడ విప్లవాభిమానులందరికి ప్రతినిధులుగా నిలిచిపోయిన జ్ఞాపకాలు మాత్రం రంగయ్య గారు, హరీష్.
1970 అక్టోబర్ 8, 9 తేదాలలో ఖమ్మంలో సుబ్బారావు పాణిగ్రహి నగర్ (వర్తక సంఘం) లో విరసం ప్రథమ మహాసభలు ఎంతో చారిత్రాత్మకంగా జరిగినవి. ఇవ్వాళ్ళ అదంతా నిర్మాణం అవుతున్న చరిత్రలో భాగమే. ఇక్కడ ఒక జ్ఞాపకం మాత్రం చెప్పాలి. విరసం ప్రణాళిక రచించి, కె.వి.ఆర్. మహాసభ ప్రతినిధుల సమావేశంలో ప్రవేశపెట్టారు. అందులో స్పష్టంగా ”దీర్ఘకాలిక సాయుధ పోరాటాన్ని బలపరుస్తాం” అని క్రాంతికార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. ఆ తీర్మానాన్ని బలపరిచినవారిలో డాక్టర్ హరీష్, రంగయ్యగార్లు ఉన్నారు. అప్పటికే మేము వర్గ పోరాటాన్ని, శ్రామిక వర్గ పోరాటాన్ని, మార్కి ్సజాన్ని పూర్తిగా బలపరుస్తామని చెప్పుకొని ఉన్నాము. ఈ చర్చను ఒక కొలిక్కి తెద్దామనే ఉద్దేశ్యంతో కొంత హాస్యస్ఫూరకంగా కొడవటి గంటి కుటుంబరావు గారు పోరాటం తొందరగా విజయంతం అయితే మీకేమైన అభ్యంతరమా అన్నారు. దీర్ఘకాలిక సాయుధపోరాటం మూడవ ప్రపంచ దేశాల వ్యవసాయ విప్లవానికి అవసరమని భావించే సభలో ఉన్న ప్రతినిధులందరి తరపున డాక్టర్ హరీష్ లేచి ”రష్యాలో జరిగిన సాయుధ తిరుగుబాటుకు, అందులో కార్మికవర్గ భూమికకు చైనాలో జరిగిన దీర్ఘకాల నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఉన్న పోలికలు, తేడాలు వివరించి - ఇది మా కోరిక ఇష్టానిష్టాలకు సంబంధించిన విషయం కాదు. ప్రజలకు కూడా తమ ఇష్టానుసారం చరిత్రను నిర్మించలేరా ? మార్చలేరా ?” అని చెప్పడానికే అన్నాడు.
ఇటువంటి సాహిత్య చర్చలకే కాదు ఆ సభలకు ఆర్ధికంగా నిర్వాహణ పరంగా అన్ని విధాల విజయం వంతం చేసినవాళ్ళల్లో డాక్టర్ హరీష్ ముందుండేవాడు.
విరసం ఏర్పడిన ఐదు నెలలకే విరసం కవితా సంకలనం ‘ఝంఝ’, పెంఢ్యాల కిషన్‌రావు సంపాదకత్వంలో జులై నాలుగున వెలువడిన ‘మార్చ్’ నిషేదానికి గురి అయ్యాయి. 10 నెలలు తిరగకుండానే 71 ఆగస్టులో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజులు పి.డి.యాక్ట్ కింద అరెస్ట్ అయ్యారు. ఈ కాలమంతా మా కష్టసుఖాల్లో మాకు అండగా నిలిచినవారిలో ఖమ్మం నుంచి ఎందరో సానుభూతిపరులు, డాక్టర్లు, న్యాయవాదులు ఉన్నారు. వాళ్లను కూడగొట్టినవారిలో హరిష్ ముఖ్యడు. మేము 73 అక్టోబర్‌లో ఆంతరంగిక భద్రత చట్టం క్రింద అరెస్ట్ అయి నవంబర్‌లో విడుదల కాగానే నన్ను, చెరబండరాజును, యం.టి.ఖాన్‌ను, పత్తిపాటిని పిలిచి హరీష్ ఖమ్మంలో విజయోత్సవ సభ పెట్టాడు. ఎమర్జెన్సీరోజులు దాకా ఖమ్మం నుండి విరసంకు అందిన సహాయ సహకారాలకు డాక్టర్ హరీష్ వాహిక.
సృజనకు జీవిత సభ్యత్వాలు కట్టించాలని నిర్ణయం జరిగినప్పుడు బహుశ అప్పటికే హరీష్ ఖమ్మం మారాడు. మయూరి లాడ్జిలో కలుసుకునేవాళ్లం. సృజనకు చాల మంది డాక్టర్లను సభ్యులుగా చేర్చారు. ఎవరి జీవిత కాలం అడిగాడు హరీష్ ‘ఎవరిది ముందైతే వారిదే’ నన్నాను. సృజన జీవితమే ఎన్నో ఒడిదుడుకులతో నడిచింది. 1992 లో ముగిసింది. అయితే సృజన ఆగిపోదు. సమైక్యంగా కూడా ప్రయత్నిస్తే, పూనుకుంటే మళ్ళా ప్రారంభించవచ్చునేమో కూడా కానీ గత సంవత్సరం కన్నుమూసిన డాక్టర్ హరీష్ మళ్ళీ వస్తాడా ? సాహిత్యం, మార్కి ్సజం, చర్చించటానికి, సునిశిత పరిశీలనలు, వ్యాఖ్యలు చేయడానికి.
చెరబండరాజు అనారోగ్యం, అమరత్వం శివసాగర్ సమగ్ర కవితా సంకలనం ప్రచురణ వంటి సందర్భాలలో డాక్టర్ హరీష్ ప్రస్తావన, పేరు వింటున్నాను. కాని యమర్జెన్సీ తరువాత మేము కలుసుకున్నది తక్కువ. 1974 అనుకుంటాను, ఖమ్మంలో ఏదో సభ ఏర్పాటు చేసి క్రాంతికార్ నన్ను పిలిచాడు. మయూరి లాడ్జిన దిగమన్నాడు. దిగాను. అయితే ఆ సభకు అనుమతి లభించకపోవడమే కాదు, ఊళ్ళో 144 సెక్షన్ పెట్టారు. నన్ను అరెస్ట్ చేస్తామని, ఖమ్మం వస్తాడేమో కాని, ఎట్లా పోతాడో చూస్తామని యస్.పి. అనడం. ఎట్లాగైతేనేం హరీషే నన్ను వరంగల్ పంపాడు. 1979 రాడికల్ యూనియన్ సభలు మళ్ళీ ఖమ్మంలో జరిగాయి. విరసం సభలను మరిపించాయి. బెయిల్ మీద విడుదలయి స్వయంగా, కొండపల్లి సీతారామయ్య, ఆ సభల్లో పాల్గొని పెద్ద ఆకర్షణ అయ్యాడు. భారతదేశంలో నిర్వహించవలసిన వ్యవసాయ విప్లవం గురించి ఆయన చరిత్రాత్మకమైన ప్రసంగం అప్పటిదే. ”పేదవాళ్ల కోసం పెద్ద వాళ్ళ ఇంటిలో పుట్టిన కమ్యూనిస్టు పార్టీ పేదవాళ్ళను వెతుకుతూ బయలుదేరింది” అని ఆయన చేసిన వ్యాఖ్యానం ఆ సభలో కలకలం రేపింది.
నేను 2005 మార్చిలో జైలు నుండి విడుదలవగానే హరీష్ నుండి ఫోన్ వచ్చింది. నేను డాక్టర్ హరీష్‌ను జ్ఞాపకం ఉన్నానా అని. అదేమిటి, మిమ్ములను ఎట్లా మర్చిపోతాను. అన్నాను. అప్పుడు ఆయన జ్ఞాపకాల దొంతర. ఆయనేదో నిర్ణయం తీసుకోవడానికి సలహాకావల్సి వచ్చింది. ఆయన నా సలహా పాటించింది, లేనిది తెలియదు.
మార్కి ్సస్టు స్టడీ సర్కిల్ రాధాకృష్ణ ఫోన్ చేసి చెప్పాడు. హరీష్ గారు హాస్సిటల్‌లో వెంటిలేటర్స్ పై ఉన్నారు. డాక్టర్లు ఇంటికి తీసుకుపొమ్మన్నారు. వెంటనే వెళ్ళి చూసాను. వరంగల్‌లో సంభాషణకు, చర్చకు 4 దశాబ్ధాలక్రితం పిలిచిన హరీష్‌ను ఏ మాట, ఏ చర్చలేకుండా - బహుశ మృత్యువుతో ఘర్షణ పడుతున్న మిత్రుడిని ఆఖరిసారి చూశాను. మౌనంగా ఇంచుమించు 40 ఏళ్ళ జ్ఞాపకాన్ని తొలగిస్తూ…
* * *
మంచి మిత్రుడు
- శివసాగర్
అవి ‘చైనా ఇండియా సరిహద్దు సంఘర్షణ’ జరిగిన రోజులు - ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిపోతున్న రోజులు - వసంతకాల మేఘ గర్జన’ ఇంకా వినిపించని రోజులు -
అప్పుడు నేను కాజీపేట సెయింట్ గాబ్రియేల్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌ని. డా|| హరీష్ వరంగల్‌లోని కాకతీయ ప్రైవేట్ మెడికల్ కాలేజిలో విద్యార్థి.
వరంగల్‌లో పాలక రాజకీయ పార్టీలు రౌఢీల, నాయకత్వంలో ఉన్నాయి. కమ్యూనిస్టులు విద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు పెట్టడానికి వీల్లేదు. వరంగల్ పట్టణంలో రిక్షా వర్కర్స్ యూనియన్ పెట్టడానికి వీల్లేదు. అజంజాహి మిల్లులో ఫాక్టరీ మేనేజిమెంట్, పోలీసు, కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ సంఘాలు, పరిపాలక వర్గ సంఘ నాయకులు, సానుభూతి పరులపై పట్టపగలు బహిరంగ దాడి చేయగా, పార్టీ నాయకత్వం ప్రతిదాడి చేయడానికి నిరాకరించి లొంగిపోయిన రోజుల్లో తలెత్తిన రౌఢీ ముఠాలు, నగరాన్ని తమ ఆధిపత్యంలోకి తీసుకున్నాయి.
వరంగల్ జిల్లా మార్కి ్సస్ట్ పార్టీ నాయకులు ఈ పరిస్థితుల్లో చేయగలిగినది ఏమీ లేదని, రౌఢీ ముఠాలతో ఘర్షణ రాకుండా తప్పుకు తిరగాలనే పంథాను మా ముందు ప్రతిపాదించింది. ఇలా ప్రతిపాదించింది విడిపోయిన మార్క్సిస్ట్ పార్టీ నాయకత్వమే. దీన్ని మేము ఆమోదించలేదు. ఈ రౌఢీ ముఠాలు కాగితం పులులనీ, దెబ్బకు దెబ్బ తియ్యాలని, అకస్మిక రహస్య దాడులు చేయ్యాలనే పంథాను సూచించాము. ఈ విప్లవ పంథాను ఆమోదించిన మెడికల్ కాలేజీ విద్యార్ధులో డా|| హరీష్ ఒకరు.
చాలా కాలం వరకు దాడి చేస్తున్నది ఎవరో శత్రువుకు తెలియని పరిస్థితి. దాడి చేసి తిరిగి వచ్చిన వారిని అజ గట్టుకోవడంలో డా|| హరీష్ తనవంతు పాత్రను పోషించారు.
ఎప్పుడు వెళ్ళినా ఏదో చదువుతూ ఉండేవాడు, ఎదో రాస్తూ ఉండేవాడు. హరీష్‌కు సాహిత్యం అంటే పిచ్చి అని, ఏదో రాస్తూ ఉంటాడని, వాటిని వార్త పత్రికలు ప్రచురిస్తూ ఉంటాయని చెప్పేవారు. రౌఢీలను అదుపు చేసిన తరువాత వరంగల్‌లో జరిగిన డెమాక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ప్రథమ మహాసభలో ఆయన కూడా పాల్గొన్నారు. తర్వాత అటు శ్రీకాకుళ ఉద్యమ నాయకత్వానికి, పుల్లారెడ్డి - నాగిరెడ్డి పార్టీలకు మధ్య జరిగిన చర్చల్లో ఆయన శ్రీకాకుళ నాయకత్వంలో ఉన్నారు.
తెలంగాణాలో, అదిలాబాద్‌లో ఉన్న కొండపల్లి సీతారామయ్య, వరంగల్‌లో ఉన్న నేను మరియు ఇంజనీరింగు, మెడికల్ కాలేజీ విద్యార్ధులు మేమంతా శ్రీకాకుళం సాయుధ పోరాటం ప్రారంభించాలనే పంథాను బలపర్చాము. అదే కాలంలో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బలపర్చాము.
ఆ రోజుల్లో నేను రాసిన ‘తూర్పు పవనం వీచెనోయ్’ పాటను నాతో హరీష్ పాడించుకునేవాడు.
1969లో నేను రహస్య జీవితానికి వెళ్లి పోయాను. తర్వాత రోజుల్లో ఆయన ఖమ్మం వెళ్లిపోయాడు. రహస్య జీవితంలో అప్పటి డా|| హరీష్‌తో సహా వరంగల్ మెడికల్ విద్యార్ధులెవ్వరినీ నేను కలుసుకోలేదు. పార్వతీపురం కుట్ర కేసులో ”విప్లవం నా జన్మ హక్కు” అని నేను చేసిన ప్రకటనను డా|| హరీష్ చాలా మెచ్చుకున్నాడని మిత్రులు చెప్పేవారు.
1972లో, వరంగల్ జిల్లా గురిమెళ్ళ అడవుల్లో ”సత్యమూర్తి ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడ”ని పోలీసులు ప్రకటించినపుడు హరీష్ ‘నరుడు చనిపోయాడని’ ఏడ్వకుండానే అన్నాడు. మూడు రోజుల తర్వాత ” చనిపోయింది సత్యమూర్తి కాదు కొల్లిపర రామ నరసింహారావు” అని పార్టీ సన్నిహితుల ద్వారా తెలిసినపుడు ”తిరిగి లేచాడు” అన్నాట్ట ఏడుస్తూ.
1987లో నన్ను పార్టీ నుండి బహిష్కరించిన తర్వాత ‘ముఠాలు కట్టలేని వాడికి రాజకీయాలెందుకు’ అని వాఖ్యానించాడని అంటారు.
2003లో ప్రజా ప్రతిఘటన పార్టీ నాయకత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాతనే మొట్టమొదటి సారిగా ఖమ్మంలో డా|| గోపినాథ్ గారి ఇంట్లో డా|| హరీష్‌ను కలుసుకున్నాను. నన్ను చూడగానే ‘నర్రెంగసెట్టు కింద నరుడో భాస్కరుడా’ అని నిశ్శబ్ధంగా హమ్మింగు చేసాడు. రైల్వేస్టేషన్‌లో దిగబెడతాను రమ్మని తన కారులో ఎక్కించుకున్నాడు. డాక్టరువి అయిన నీకు గుండెనొప్పి ఏమిటని అడిగాను. ఆయన పెద్దగా నవ్వి ‘ఈ కారు కొన్నాను, నడవడం మానేసాను’ అన్నాడు. ఇద్దరం ఖమ్మం రైల్వేస్టేషన్ చేరాము. విజయవాడ రైలు కోసం నిరీక్షిస్తూ ఒక ప్రక్కగా కూర్చున్నాం. శివసాగర్ కవితా సంకలనం ప్రచురించాలని అనుకుంటున్నాం అన్నాడు. ఆమోదంగా తలూపాను.
‘ జీవితమా ! నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ అనే కవిత నాకు నచ్చింది. అది నీవు నిజం మాట్టాడుతున్నట్లుగా ఉంది అన్నాడు. అది ఏ పరిస్థితుల్లో రాసానో క్లుప్తంగా వివరించాను.
2001 లో ఖమ్మంజిల్లా గుండాల అటవీ ప్రాంతంలో దళాలకు రాజకీయ తరగతులు నిర్వహిస్తుండగా పోలీసు బలగాలు మమ్మల్ని నాలుగు వైపులా చుట్టముట్టడం, ఆ చక్రబంధం నుండి తప్పుకోవడం, సురక్షిత ప్రాంతానికి చేరిన తర్వాత ఆదమరచి నిద్రపోవడం, ఉదయమే లేచి గుక్కతిప్పుకోకుండా ఈ కవితను రాయడం జరిగిందన్నాను. ”పుస్తకం - అచ్చువేయిస్తాను, కవర్ పేజీ ఎలా ఉండాలో నాకు వదిలేయండి, గుర్రం సీతారాములు అన్ని బాధ్యతలు చూస్తాడు” అని చెప్పాడు. రైలుకు సిగ్నల్ ఇచ్చారు. ”చూడు శి.సా.,” నువ్వొకసారి మా ఇంటికి రావాలి. నాతో కలసి భోంచేయ్యాలి, ఒక రోజంతా మనం కలిసి ఉండి సాహిత్యం గురించి, రాజకీయం గురించి మాట్లాడు”కోవాలి అన్నాడు.
అలాగే అన్నాను. నేను కలుసుకోకముందే ఆయన వెళ్ళిపోయాడు. డాక్టర్ హరీష్ మంచి మిత్రుడు.
సంస్మరణ
Trackback URI | Comments RSS
Hiç yorum yok:
Yorum Gönder