ఆత్మగౌరవ యుద్ధ కవిత RSS: అభిప్రాయాలు
అక్టోబర్2008
ఆత్మగౌరవ యుద్ధ కవిత కందిలి
గుర్రం సీతారాములు
"మహా కవుల మరణ యుద్ధ కవిత" పేరుతో మార్చి 2 వార్త ఆదివారం అనుబంధంలో"దళిత కవులు ఇంకా బ్రతికే ఉన్నా దళిత కవిత్వం మాత్రం మరణించిందని
చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదని 'కందిలి' లాంటి కవితా సంకలనాలు రుజువు పరుస్తాయి" అన్న
తీవ్రమైన వ్యాఖ్యలకు సమాధానం ఇది.
గత రెండు దశాబ్దాలుగా సమకాలీన సాహిత్య వాద వివాదాలను సమీక్ష, విమర్శకుల అభిప్రాయాలను
శ్రద్ధగా గమనిస్తున్న
నా పరిమిత జ్ఞానంతో ఇది రాస్తున్నాను.
ఇంతగా స్పందించడానికి కారణం
" సాహిత్య విమర్శకులకు అంత్యక్రియలు నిర్వహించండ"ని అన్న సీతారాం
కొందరు దళిత సాహితీ విమర్శకుల బాధ్యతారాహిత్యం వల్లనే దళిత కవిత్వం మరణించిందనీ
కొందరి అసమర్థత వల్లనే అది అత్యంత అవమానకర రీతిలో దారి తప్పిందనీ అన్నారు.
ఈ సందర్భంగా దళిత సాహిత్యం పట్ల, కవుల పట్ల సాహిత్య అకాడమీల నిర్లిప్తత గూర్చి
ఓ గుజరాతీ దళిత కవి ఆక్రోశాన్ని కొంచెం కటువుగా ఉన్నా చర్చించుకోవడం అవసరం అనిపిస్తోంది.
" భాష అనే లంజముండ సాహిత్య అకాడమీ వేశ్యావాకిళ్ల ముందు తచ్చాడుతున్న కొజ్జాల వంక కృద్దంగా చూస్తోంది" అన్నాడు.నేడు అస్థిత్వ కులాల సాహిత్యం కూడా నోరున్న, పేరున్న సాహిత్య విమర్శకుల, సమీక్షకుల ముందు అణిగిమణిగి వుంటోంది.
వర్తమానాన్ని గమనించినట్లయితే సంఘంలో అకవులు, కుకవులు, పైగంబర, దిగంబర,
పోస్ట్‌మోడ్రన్ వగైరా..వగైరా వెనకబడిన కులాల కవులుగా చీలికలు, పేలికలుగా మారిన
కవిత్వ కూటాలను "కందిలి" కవులు మరింతగా దిగజార్చారని సీతారాం ఆవేదన చెందుతున్నాడు.
పైగా దళిత కవులలో ఒక సంక్షోభం ఏర్పడిందనీ, దాన్ని అధిగమించకపోగా
జటిలమైన వర్గీకరణ రాజకీయాల వైపు దళిత సాహిత్య ప్రస్థానం చెందిందనీ ఆక్షేపించారు.
మరియు లక్ష్మీనర్సయ్య, సతీష్ చందర్, కె.శ్రీనివాస్, అసుర లాంటి విమర్శకుల మౌనం
దళిత కవిత్వాభిమన్యుడుకి పద్మవ్యూహంగా మారిందనీ,
కొంతమంది కవులు ఉన్న కొద్దిపాటి రక్తాన్ని ఊరికే మరిగించుకొని అలసిపోతున్నారని అన్నారు.
.ఈ సందర్భంగా దశాబ్ధం క్రితం వెలువడ్డ బిసి కవుల "వెంటాడే కలాలు" పుస్తకానికి రాసిన
ముందుమాటను గుర్తుకుతెచ్చుకోమని సీతారాంను కోరుతున్నాను.
అందులో ఇంతకాలం దళిత కవిత్వం మాలమాదిగ కవులు హైజాక్ చేశారనీ,
దళిత సాహిత్యం అంటే ఆ రెండు కులాలు మాత్రమే కాదనీ దాన్ని పరిపుష్ఠం చేసింది,
అధికంగా చెమట కార్చింది మంగళ్ళు, చాకళ్ళు లాంటి వెనకబడిన కులాలేననీ
"బిసి కవిత్వం" పేరుతో ఓ చర్చను లేపడంలో పైన ఉదహరించిన వారిలో కొందరూ,
మరియు జూలూరి గౌరీశంకర్, ప్రసేన్‌తో మరికొందరూ ఉన్న విషయం
ఈ అష్టాది కవుల సమన్వయంతో కొత్త శిశువుకి జీవం పోసిన వీరు
దేశీయ మార్కిజం పేరుతో స్వదేశీ మార్క్సిజాన్ని వెలుగులోకి తెచ్చి ఎవరినోట్లో ఏమేం పోశారో సాహిత్య లోకం మర్చిపోలేదు.
దళిత కవిత్వం వారి, అస్తిత్వ చైతన్యం, ఆగ్రహం
గత కొంత కాలంగా మనువు నోట్లో పోసిన ఉచ్చనే మళ్ళీ మళ్ళీ పోయడం
మరో విధంగా ఉచ్చపోయకపోవడాన్ని తప్పు పట్టిన సీతారాం
మరెలా పోయాలో నేర్పిస్తే బాగుంటుందేమో!
కవిత్వానికి కావాల్సిన ఒడ్డు, పొడవు, నడుము కొలతలు,సాంధ్రత, గాఢత,
విస్తృతిలాంటి కొన్ని కొలిచే పనిముట్లను నిర్దేశించిన సీతారాం
అర్థంపర్ధం లేని పోస్ట్‌మోడ్రన్ కవిత్వాన్ని ప్రమోట్ చేసి,
తాళాలు మాత్రం నా దగ్గర ఉన్నాయి అని ఎలా అనగలిగారు?
ఆయన అన్నట్లు కందిలి కవితా సంకలనంలో కవిత్వం లేకపోయినా ఇది గొప్ప ప్రయత్నం,
ఈ ప్రయత్నం వెనుక అంతులేని ఆవేదన ఉంది.
ఆ ఆవేదన వెనక వేల సంవత్సరాల దాష్టీకం ఉంది.
బ్రాహ్మణ వాద గుట్టును నిట్టనిలువుగా చీల్చే ప్రయత్నమే ఇది.
ఇది ఓ అంటరానివాని ఆక్రందన, తన పుట్టుకను దుర్మార్గంగా చిత్రించినందుకు
చరిత్రలో జరిగిన ద్రోహానికి కారణాల వెతుకులాట,
సామాజిక ఉద్యమాల చైతన్యంతో వచ్చిన స్ఫూర్తితో జరిగిన ఈ ప్రయత్నం
హర్షించదగినది. ఆహ్వానించదగినది.
వర్గీకరణ రాజకీయాలు తెచ్చిన చైతన్యంతో వచ్చిన బలమైన కవిత ఎండ్లూరి సుధాకర్ "వర్గీకరణీయం"
అంతకుముందు వచ్చిన నాగప్పగారి సుందర్రాజు రచనలు,
మల్లెమొగ్గల గొడుగు, ఎదురుచూపులు కథా సంకలనం
గోగు శ్యామల, సుభద్రల నల్లరేగడిచాళ్లు,
పరిమళ్ , వేముల ఎల్లయ్య జిలుకర శ్రీనివాస్, డా. దార్ల, ప్రొ.డివి కృష్ణ, కదిరె కృష్ణ,
ఐనాల సైదులులాంటి బలమైన సాహితీ విమర్శకుల, కవుల కవిత్వాన్ని మనసు పెట్టి చదవమని కోరుతున్నాను.
ఇటీవల సెంట్రల్ యూనివర్శిటీలో మాదిగ, మాదిగ ఉపకులాల కవుల
రాష్ట్ర స్థాయి సదస్సులో జరిగిన చారిత్రక విషయాలను తెలుసుకోమని చెప్తున్నాను.
కందిలి కవిత్వం రాజకీయ నినాదమై తేలిపోయిందని
విశ్వవిద్యాలయంలో పరిశోధన చేయడానికి "కందిలి కవిత్వం-ఒక పరిశీలన" అనే అంశానికి బాగా పనికొచ్చే పుస్తకం అని ఎద్దేవా చేయడం
యూనివర్శిటీలో అధ్యాపక వృత్తిలో ఉన్న సీతారాం
ఈ రకమైన వ్యాఖ్య చేయడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.
ఆయనే అన్నట్లు
కందిలి కవిత్వం వెనుక ఉన్న జీవితం పెద్దది
ఆ సంస్కృతి మరి ఏ ఇతర సంస్కృతి కన్నా తక్కువది కాదు,
ఎందుకంటే మానవ జీవితానికి ఉన్న అనేక విలువల స్ఫూర్తి మాదిగ కులానికి ఉంది.
అద్వితీయమైన అనుభవసారం ఉంది. సమాజానికి శ్రమ సంస్కృతినీ, శాస్త్రీయమైన చర్మ శుద్ధినీ,
ఆది మానవ దశలోనే సంస్కృతికి డప్పును అందించిన గొప్ప చారిత్రక నేపథ్యం ఉన్న మాదిగ కులం
వ్యవస్థకు పట్టిన మలినాన్ని శుద్ధిచేసి పరిశుభ్రతను ప్రసాదించిన మహోన్నత వారసత్వం మాది.
ఆది జాంబవ వారసులైన మాదిగలం
మేము ఈ సమాజం మాదిగీకరణ చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని
గట్టిగా చెప్తున్నాం.
నేను ఎండలో ఎండుతున్న ఎండు మాంసాల హారాన్ని.
కాల్పనిక సింహద్వారాల మీద ఎగరేసిన గెలుపు జెండాని,
ఆ గెలుపు జెండా ఎగరేసే రోజు ఎంతో దూరంలో లేదు.
మీ అభిప్రాయం తెలుపండి